శేషాద్రిపై నెలకొన్న శ్రీనివాసా !
ఈ ధాత్రి విషయమై మరచినావా !
నిత్యధూప దీపనైవేద్యాల
నిరంతర స్తొత్ర సంకీర్తనల
నిను గొల్చి మెప్పించి నీకునర్పించు
ముడుపులను చూచి మురిసిపోయేవ ?
సుందర స్వర్ణమందిరాంతర్భాగాల
మంజరీ మధురనెత్తావి వీవెనల
పట్టుపానుపు మీద పద్మావతిని గూడి
ఇదియే వైకుంఠమ్మని వొళ్ళు మరచినావా ?
పూజా పునస్కారముల నీ కళ్ళు గప్పి
గుళ్ళుగోపురాల నిన్ను బంధించి
కత్తికెదురు లేకుండ విఱ్ఱవీగుచున్న
మనిషి మాయలో బడి మరచిపోయేవ ?
లే ! లేవయ్య నా స్వామి, నిదురలేవయ్య !
కళ్ళు తెరచి లోకాన్ని కాంచవయ్య !
బండరాయి వలె ఓ మూల పడుండకయ్య !
బంగారు చెఱ నుండి బయటపడవయ్య !
నిన్ను బొమ్మను చేసి ఆడించు మనిషి
నీ ఉనికి నొకమారు నిరూపించవయ్య !
0 comments:
Post a Comment