బెల్లంకొండ రత్నం

  • పరిచయం
  • చిత్రలేఖనం
  • కవితలు
  • గేయాలు
  • పద్యాలు
  • నాటికలు
  • ఛాయాచిత్రాలు

Saturday, November 24, 2018

కుందేట

 November 24, 2018     గేయాలు     No comments   

లెయ్యే ! సినదానా !
పోదాము కుందేటకి  !
రెడ్డప్పరెడ్డి కొడుకంట
కుందేలు కావాలంట
లెయ్యే ! సినదానా !
పోదాము కుందేటకి  !    
                                   అహ లెయ్యే ||
ఎదురుగ నువ్వుంటే
నాకెదురే లేదంట
ఎంట నువ్వుంటే
యాట నాదంట
లెయ్యే సినదానా
పోదాము కుందేటకి
                                  అహ లెయ్యే ||
పేటకు పోదామే
నాటు కొడదామే
సినిమా చూద్దామే
జల్సా చేద్దామే
                                 అహ లెయ్యే ||
సారా మాటంటే
రాను పొమ్మంటా
తాగను అంటేనే
తోడుగ నేనుంటా

అట్టాగే యినుకుంటా
రావే నా యెంటా
  • షేర్ చెయ్యండి :  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Saturday, November 17, 2018

విరహిణి

 November 17, 2018     గేయాలు     No comments   

మాధవా ! రావేమిరా !
రాధ నీకై వేచెరా -ఈ
రాధ నీకై వేచెరా !

సంజ చీకటి ముసిరెరా
చల్లగాలులు వీచెరా
నింగి చంద్రుడు వెలిసెరా
నీట కలువలు విరిసెరా
సుందరాంగ విందుజేయ
పొలతి నిన్నే పిలిచెరా !

                                  మాధవా ||

వయసురేకులు విచ్చెరా
సొగసుసొంపులు హెచ్చెరా
మనసు మమతల నిండెరా
మరుల గుండెలు మండెరా
పంకజాక్ష ! పొందుగోరి
పొలతి నిన్నే పిలిచెరా !

                               మాధవా ||

ఊహలు జ్వాలలై నన్ను దహించెరా !
ఓపలేనురా ...జాలమేలరా !
జాగుచేయకిక వేగమేలరా !

                               మాధవా ||     

  • షేర్ చెయ్యండి :  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Saturday, October 6, 2018

ఆశ

 October 06, 2018     కవితలు     No comments   

పుట్టిన ప్రాణి గిట్టుట తథ్యం
గిట్టేదాక బ్రతుకుట ముఖ్యం
బ్రతకాలంటే ఆశ అవసరం
ఆశ లేనిదే లేదు జీవితం

ఆశకు కూడ ఉన్నది హద్దు
ఆశతో ఆశను తుంచొద్దు
ఆశ ఆశను వెలిగిస్తే ముద్దు
అప్పుడే అందరికీ సుఖం కద్దు

అర్హత మించి ఆశలు పెంచకు
ఆశించిన దానిని సాధించక మానకు
సాధించిన దానిని ఒక్కడే కుడువకు
కలసి భుజించుట ఎన్నడు మరువకు

ఆశాసూత్రము నాచరించితే
ఆత్మను వీడు నశాంతి
అంతట నిండును సుఖశాంతి
అవని పాడును ఆనందగీతి

  • షేర్ చెయ్యండి :  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Saturday, September 22, 2018

ఆరాధన

 September 22, 2018     గేయాలు     No comments   

నిన్నే చూస్తున్నా ! నీలో నన్నే చూస్తున్నా!
నిన్ను చూస్తూ నన్ను నేనే మరచిపోతున్నా
నన్ను నేనే మరచిపోతున్నా !


మంచు పొరల చీరకట్టి మల్లెపూలు జడను పెట్టి
సిందూరం నుదుట దిద్ది ముందర నువు నిలుచుంటే
మోము మీద మరులుగొన్న ముంగురులనే చూస్తున్నా
నన్ను నేనే మరచిపోతున్నా 

                   
                                                         నిన్నే ||
 
కలువరేకుల కళ్ళు కబురులేవో చెబుతూంటే
మావిచివురు నీ మోవి మొలకనవ్వు చిలుకుతుంటే
నీ హాసచంద్రికలో నేను సోలిపోతున్నా !
నన్ను నేనే మరచిపోతున్నా !

                   
                                                         నిన్నే || 

మదిని దోచు మోహినివై మదనరాగమంజరివై
మదమరాళ గమనముతో ముదముమీర వస్తూంటే
మువ్వల రవళిలోని మూగబాస వింటున్నా !
నన్ను నేనే మరచిపోతున్నా !

                   
                                                         నిన్నే || 

తరువు జేరు తీవియవై ఉదధి గలియు నదియె వై
ఎదనువాలి మధురముగ ఒదిగి ఒదిగిపోతుంటే
నిన్ను చూస్తు నన్ను నేనే మరచిపోతున్నా !
నీ కోసమే నా జీవనమంటున్నా !!

                   
                                                         నిన్నే ||

  • షేర్ చెయ్యండి :  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Friday, August 17, 2018

అన్నమాచార్య

 August 17, 2018     నాటికలు     No comments   




అన్నమయ్య అనగానే ఒక గొప్ప వేంకటేశ్వరస్వామి భక్తుడని,సంకీర్తనాచార్యుడని మనకందరికీ తెలుసు. కానీ ఆయన జీవిత విశేషాలు , పూర్తి రచనలు, శ్రీవారికి ఆయన ప్రవేశపెట్టిన కైంకర్యాలు గురించి బహుకొద్ది మందికి మాత్రమే తెలుసు. అన్నమయ్య మూల కథకు సహజ వ్యక్తిత్వానికి భిన్నంగా ఈ మధ్య వచ్చిన కల్పనలను వాస్తవాలనే భ్రమనుండి సామాన్యులు బయటపడాలంటే సాధికారమనదగ్గ సరిక్రొత్త కళారూపాలు, నాటకాలు , విరివిగా రావలసిన అవసరముంది. ఆ దిశగా శ్రీ రత్నం గారు చేసిన ప్రయత్నమే  ఈ "అన్నమాచార్య"  పద్య నాటకం.

పలు గ్రంథాలను పరిశీలించి, ప్రముఖ పండితులను సంప్రదించి, అన్నమయ్య మనుమడు చినతిరువేంగళనాథుడు (చిన్నన్న) రచించిన " శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య జీవిత చరిత్ర " దానికి శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి పీఠికను ఆధారం చేసుకొని, నాటి చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, మూలకథకు పాత్రల ఔచిత్యానికి భంగం కలుగకుండా సహజత్వాన్ని ప్రతిబింబించే సన్నివేశాలతో శ్రీరత్నం గారు అన్నమాచార్య నాటకాన్ని రచించారు. అన్నమయ్య సమగ్ర జీవిత చరిత్రతో పాటు, ఆయన కీర్తనల వైవిధ్యం , ఆంతర్యం, అంతరార్థం, సామాజిక ప్రయోజనం ఇవన్నీ వివరించే ప్రయత్నం చేశారు.

శ్రీ రత్నంగారే దర్శకత్వం వహించి ప్రదర్శించిన ఈ నాటకం 2013లో జరిగిన గరుడ రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలలో "ఉత్తమ రచన" అవార్డు పొందింది.



ఈ నాటకంలోంచి ఓ సన్నివేశం క్రింది ఫోటోలో చూడండి.


  • షేర్ చెయ్యండి :  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Friday, July 13, 2018

నాట్యమయూరి -3

 July 13, 2018     చిత్రలేఖనం     No comments   


  • షేర్ చెయ్యండి :  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Friday, June 22, 2018

మేలుకొలుపు

 June 22, 2018     కవితలు     No comments   



శేషాద్రిపై నెలకొన్న శ్రీనివాసా !
ఈ ధాత్రి విషయమై మరచినావా !

నిత్యధూప దీపనైవేద్యాల
నిరంతర స్తొత్ర సంకీర్తనల
నిను గొల్చి మెప్పించి నీకునర్పించు
ముడుపులను చూచి మురిసిపోయేవ ?

సుందర స్వర్ణమందిరాంతర్భాగాల
మంజరీ మధురనెత్తావి వీవెనల
పట్టుపానుపు మీద పద్మావతిని గూడి
ఇదియే వైకుంఠమ్మని వొళ్ళు మరచినావా ?

పూజా పునస్కారముల నీ కళ్ళు గప్పి
గుళ్ళుగోపురాల నిన్ను బంధించి
కత్తికెదురు లేకుండ విఱ్ఱవీగుచున్న
మనిషి మాయలో బడి మరచిపోయేవ ?

లే ! లేవయ్య నా స్వామి, నిదురలేవయ్య !
కళ్ళు తెరచి లోకాన్ని కాంచవయ్య !

బండరాయి వలె ఓ మూల పడుండకయ్య !
బంగారు చెఱ నుండి బయటపడవయ్య !
నిన్ను బొమ్మను చేసి ఆడించు మనిషి
నీ ఉనికి  నొకమారు నిరూపించవయ్య !

  • షేర్ చెయ్యండి :  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Sunday, June 3, 2018

ఛాయాచిత్రం -3 - శ్రీకృష్ణుడు

 June 03, 2018     ఛాయాచిత్రాలు     No comments   

రుక్మిణీ కల్యాణంలో శ్రీకృష్ణుడుగా



  • షేర్ చెయ్యండి :  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Tuesday, May 29, 2018

ప్రేమ

 May 29, 2018     గేయాలు     No comments   


వెన్నెల కురిసెలె, వలపులు విరిసెలె
మమతల మాధురిలో మనసులు మురిసెలె 
                       
                                               వెన్నెల ||

కళ్ళల్లో మెరిసెలె కొత్త మెరుపులు
గుండెల్లో కురిసెలె కోటిమమతలు
నవ్వుల్లో విరిసెలె సిరిమల్లె పువ్వులు
నీ ప్రేమ పూజకే చిందించు తేనెలు

                                                    వెన్నెల ||

నింగి నేల కొరగిపోయె  -చోద్యము
నీవు నేను  ఏకమైన  - స్వర్గము
ప్రేమయే జీవిత మకరందము
ప్రేమయే జగతికి ఆధారము  

                                                  వెన్నెల ||

  • షేర్ చెయ్యండి :  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Friday, May 11, 2018

నాట్యమయూరి -2

 May 11, 2018     చిత్రలేఖనం     No comments   


  • షేర్ చెయ్యండి :  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Friday, May 4, 2018

నివేదన

 May 04, 2018     కవితలు     1 comment   


ఎవరు నువ్వంటే ఏమని చెప్పను ?

నవ్యనాగరికతా దివ్య దీప్తుల
చూడలేక నా కళ్ళు చూడ్కిపోయె
నింగికెగబ్రాకు విజ్ఞాన శిఖరాల
అందుకొనలేక నా వొళ్ళు అలసిపోయె

దయాధర్మరహిత దౌర్జన్య కౄర
కబంధ హస్తాల నా బ్రతుకు చితికిపోయె
ప్రేమాభిమాన విహీన పైశాచికారముల
విని విని నా మనసు మూగవోయె

ఆశల వెలుగేలేని అంధకారములోన
ఘోర భీకర దుర్భర జీవితారణ్యమున
కఠిన పాషాణ కంటకావృతముల బడి
దారి తెన్నులేక తిరుగాడు దీనుడను నేను

పంచభక్ష్య పరమాన్నములు తిని
విసరి పారవేసిన ఎంగిలాకులకై
ముసిరిన కాకుల మూగిన కుక్కల
విసిరి తరుమలేక కసరి కొట్టలేక
కాలే కడుపును కన్నీట తడుపలేక
చావలేక బ్రతుకుతున్న సజీవిని నేను

బంగారు భవనాల పారుగోడల నీడ
ఉప్పొంగి ప్రవహించు మురికి కాల్వ చెంత
నడిరోడ్డు దుమ్ము నిండు కౌగిలిలోన
అందరాని ఆనంద తీరాల
అందుకోజూస్తున్న అల్పజీవిని నేను

గుండెలవిసే మండుటెండలో
వొళ్ళు చివికే వడగళ్ళవానలో
ఎండుమాకుల చెంత ఇంటిచూరుల కింద
బితుకు బితుకుమను గుండెలు
పిడికిట బిగబట్టి
తలదాచుకోనింత చోటులేక
చీకుచింతాలేని చెట్టుచేమల జూచి
బాధలెరుగని బండరాళ్ళను చూచి
ఓర్వలేక  వగరుస్తున్న మనిషిని నేను 

కుక్కనై పుట్టినా కూడుతినేవాన్ని
గువ్వనైపోయినా గూడు కట్టుకొనేవాన్ని
మనిషినై పుట్టి మనిషిగా మసలలేక
నిత్యం చస్తున్న నిర్భాగ్యుడిని నేను
చచ్చి బ్రతుకున్న సౌభాగ్యుడను నేను

విసురు కసురులేక ఓపికతో విన్నావు
ఎంత సౌమ్యుడవీవు? ఎవరు నీవు ?

అరెరె ! అది ఏమి !..

ఉబికి ఉప్పొంగు దు:ఖమ్ము
వెక్కిళ్ళ వెలిగ్రక్క వినవచ్చె !
కడలిఘోషల దాగు బడబాగ్ని బాధ
నీ గుండె కుత్తులోన ఘూర్ణిల్ల సాగె !

ఏమి ? నీవూ నా బోటివాడవేనా ??
అంతుపొంతులేని మన బ్రతుకులొక్కటేనా ??

అవునులే ! మనముగాక మనకున్న దిక్కెవరు !
మనగోడు విని కడతేర్చు నాథుడెవ్వరు !!

  • షేర్ చెయ్యండి :  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Tuesday, April 24, 2018

హోదా గోదా !

 April 24, 2018     పద్యాలు     1 comment   




గీ||  శిశువు బ్రతికించ గర్భము చీల్చివైచి
తల్లి గాపాడు బాధ్యత తలుపరైరి,
యండదండగ మేముందు మాంధ్రకనుచు
మాయమాటల మా గొంతు కోయతగునె?

ఆ||  కీడు జేయువారి కించెత్తు పడనీక
యెదిరి పోరువాని కేడ్వతగునె ?
కలసికట్టు నిలచి కలబడ్డ విజయమ్ము .
పొరుగుజూసియైన బుద్ధిరాదె !

ఆ||  పార్లమెంటులోని ప్రతిపక్ష పార్టీలు
తోడునిల్చి పోర కూడిరాగ,
నాంధ్రులందె చూడ నైక్యత కరువాయె .
హోద వచ్చుటెట్లొ బోధపడదు .

ఆ||  రాజకీయమెపుడు రాక్షస క్రీడైన
ప్రజల హాని దలుప పాడియౌనె ?
పదవి కొరకు ప్రజల భవితను బలిజేయు
నీచ నాయకులను పీచమడచు .




  • షేర్ చెయ్యండి :  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Monday, April 23, 2018

ఛాయచిత్రం-2 - దుర్యోధనుడు

 April 23, 2018     ఛాయాచిత్రాలు     No comments   

మానధనా సుయోధనా !



  • షేర్ చెయ్యండి :  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

ఛాయచిత్రం-1 - తేజసింహుడు

 April 23, 2018     ఛాయాచిత్రాలు     No comments   

"మహారాణా ప్రతాప్" నాటకంలో తేజసింహుడిగా



  • షేర్ చెయ్యండి :  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Sunday, April 8, 2018

రుక్మిణీ కల్యాణం

 April 08, 2018     నాటికలు     No comments   

శ్రీమద్భాగవతంలోని అనేక రసవద్ఘట్టాలలో రుక్మిణీ కల్యాణం ఒకటి.

 భక్తితో పాటు ప్రేమ, ఆరాధన, అనుబంధాలు ఇందులో ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉన్నాయి. పరమాత్వ తత్వంతో పాటూ, జీవిత సత్యం కూడా పొందుపరచబడి ఉన్న ఈ మధుర ఘట్టాన్ని మారుతున్న కాలపరిస్థితులను,రంగస్థల ప్రదర్శనానుకూలతను దృష్టిలో ఉంచుకొని సరళమైన పద్య సౌందర్యంతో, సర్వ జనామోదయోగ్యమైన నాటకంగా తీర్చిదిద్ది తెరకెక్కించే ప్రయత్నం చేశారు శ్రీ రత్నంగారు.


 ఈ నాటకంలోని కొన్ని రమ్యమైన పద్యాలను ఇక్కడ పొందుపరుస్తున్నాం.

 జగన్నాటక సూత్రధారియైన శ్రీకృష్ణుని ప్రేమకై అపర లక్ష్మీదేవియైన రుక్మిణి తపించి,దుఃఖించే సందర్భంలో వచ్చే సీస పద్యం.

సీ||

 సరసిజనాభ ! నీ శౌర్యార్చనార్పిత
ధామమ్ము కాని సౌందర్యమేల ?
పావన చరిత ! నీ ప్రణయానురాగాల
పులకించని పరువంపు తనువేల
మోహనాకార ! నీ మోవిపై మురళీయై
మధుర శ్రుతులిడని మనుగడేల ?
దురితాపహార ! నీదు పదసన్నిధిలోన
ప్రమిదనై వెలుగని భాగ్యమేల ?

 ఆ||

 ఆశ్రిత జనపాల ! అంచిత గుణశీల !
పుణ్య హృదయలోల ! భువనపాల !
వేణుగానలోల ! వినవేల ! వేయేల !
నీవులేని బ్రతుకు నిలుపఁ జాల !

తన ప్రేమ రాయబారాన్ని దేవదేవుడైన శ్రీకృష్ణుని కడకు తీసుకువెళ్ళిన అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణుడు ఎంతకీ తిరిగిరాకపోయేసరికి 'ఏమైనదో ఏమో' అని రుక్మిణీదేవీ మనస్సు పలువిధాలుగా ఆలోచిస్తూ, చింతించే సమయంలో వచ్చే మరొక సీస పద్యం.

సీ||

ఏల నా స్వామి రాడెమి కథెమొ ? భూసు
రేంద్రు డగ్నిద్యోతు డేగె,వృద్ధు
డాయాసపడి, దుర్గమారణ్య మార్గమున్    
గడచెనో,కడచినా ,కడలనధిగ
మించి ద్వారకపురమేగెనో ? ఏగిన
మాధవు దర్శన మతనికాయె
నో లేదో,విని ఏమనుకొనెనో మనమున
దయచేయ తలచునో,తలుపడేమొ

గీ||

కలికి ! శ్రీ గౌరి ఏరీతి కరుణగొనునో
వ్రాలు నా తలనేమని వ్రాయబడెనో
తెల్లవారె లగ్నము,వచ్చిరెల్లవారు
ఎట్లు తెల్లవారునో బ్రతుకేమి జేతు

రుక్మిణీ కల్యాణం నాటికపై అవధాన చక్రవర్తి, శతావధాన సార్వభౌమ డాక్టర్ మేడసాని మోహన్ , శతాధిక నాటకకర్త, నాటక నవరత్నం కొడాలి గోపాలరావు వంటి ప్రముఖులు వెల్లడించిన అభిప్రాయాలను ఇక్కడ జతపరుస్తున్నాం .





  • షేర్ చెయ్యండి :  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

రాగం పలికింది

 April 08, 2018     గేయాలు     No comments   

రాగం పలికింది -నాలో
అనురాగం వొలికింది
                                                 || రాగం పలికింది

విరుల సరులలో తురీరవములో
ఝరుల వగలులో గిరుల నగవులో
అంతులేని ఆనందలహరిలో
పొంగి పొరలు రసతరంగిణియై

                                             || రాగం పలికింది

శరదిందుచంద్రికా చిద్విలాసమున
విరిగంధ వీచికా విరహతాపమున
మదన మనోహర మోహనాట్యమున
చిందులేయు చెలి అందెల రవళియై

                                                || రాగం పలికింది


  • షేర్ చెయ్యండి :  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

సరసిని

 April 08, 2018     కవితలు     No comments   

ఘల్లున అందెలు కదల్చనీక

మెల్లన దరిచేరి మాటునదాగి

కళ్ళను నీ మృదుకరముల గప్పి

అల్లరి చేతల నలరింతు వీవు

చక్కని చుక్కగ చెంతకు చేరి

చక్కిలిగింతల చిక్కులు రేపి

చెక్కిలి నొక్కగ చేయి చాపితే

చిక్కక చల్లగా జారుకొనేవు

పట్టుకోవాలని పైకిలేవగానే

పిట్టవోలే బెదరి పారిపొయేవు

పట్టుకోలేనని పకపకా నవ్వి

బెట్టుతో నిలువెల్ల పొంగిపొయేవు

అల్లంత దూరన అప్సరవోలె

కళ్ళింతచేసి కవ్వింతువీవు

ఎలకోయిల వలె ఎలుగెత్తి పిలిచి

కలహంస నడకల కదలిపోయేవు

దుడుకు కోర్కెల నాలో తలపింపజేసి

ఉడికించి ఊరించి ఉరకలేయించి

కడగంటి చూపుల్లో కొసరేటి-వలపు

వేడిమిలో నేను వేగిపోవంగ
సుడిగాలిలా వచ్చి చుట్టేసి -ప్రేమ

జడివానలో నన్ను ముంచెత్తివేసేవు

  • షేర్ చెయ్యండి :  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

నాట్యమయూరి -1

 April 08, 2018     చిత్రలేఖనం     No comments   

శ్రీ రత్నం కుంచె నుంచి వెలువడిన కొన్ని చిత్రాలు.





  • షేర్ చెయ్యండి :  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Saturday, March 10, 2018

ఆరోగ్య శతకం

 March 10, 2018     పద్యాలు     No comments   

ఆరోగ్యానికి సంబంధించిన అనేక విషయాలను వివరిస్తూ శ్రీ రత్నంగారు ఆరోగ్యగీత  వ్రాశారు.  ఆరోగ్యం మీద అవగాహన, చైతన్యం కలిగించటం ఆ పుస్తకం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. పాఠశాల విద్యార్థులు పునశ్చరణ చేసుకోవడానికి వీలుగా ఉండేలా ఆ పుస్తకాన్నే కాస్త మార్పులతో  115 పద్యాలకు కుదించి " ఆరోగ్య శతకం" గా అందించారు.




  • షేర్ చెయ్యండి :  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

ఆరోగ్యగీత

 March 10, 2018     పద్యాలు     No comments   


ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి ?
ఆరోగ్యంగా ఉండటమంటే రోగాలు రాకుండా ఉండటమేనా ?
వ్యాధులు ఎలా సంక్రమిస్తాయి ? వాటి నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు ఏంటి?

ప్రజారోగ్యం మీద తెలుగులో చాలా పుస్తకాలు వచన రూపంలో వచ్చాయి. కానీ ఇంతవరకు ఎవరూ  పద్యాలతో పుస్తకం వ్రాయలేదు. శ్రీ రత్నం గారు ప్రజారోగ్యం మీద తెలుగులో 704 తేటగీతి పద్యాలతో "ఆరోగ్యగీత" అనే పుస్తకం వ్రాశారు. తెలుగులో ఇది మొదటి ప్రయత్నం.


ఈ విషయాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు కుడా గుర్తించి ధృవపత్రం అందజేయటం జరిగింది.





  • షేర్ చెయ్యండి :  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

పరిచయం

 March 10, 2018     No comments   

శ్రీ బెల్లంకొండ రత్నం గారు చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన రచయిత, చిత్రకారుడు, రంగస్థల నటుడు. 


వృత్తిరీత్యా శానిటరీ సుపర్వైసర్‌గా పనిచేసి రిటైరైనా తన ప్రవృత్తులను మాత్రం వారు  ఏనాడు అలక్ష్యం చేయ్యలేదు. వారు వ్రాసిన  ఎన్నో గేయాలు, నాటికలు ఆకాశవాణి, దూరదర్శన్‌లలో ప్రసారమయ్యాయి.  పద్మశ్రీ ఆర్ట్స్ అనే నాటక సంస్థను స్థాపించి తను రచించిన నాటకాలను, ఏకపాత్రలను ఎన్నో సార్లు స్వీయ దర్శకత్వంలో  ప్రదర్శించారు.  ఇతర నాటక సంఘాలతో కలిసి అనేక  సాంఘిక, చారిత్రాత్మక, పౌరాణిక నాటకాలలో నటించి విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు, చాణక్యుడు, చంద్రగుప్తుడు, జయసింహుడు, సారాసురుడు పాత్రలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 1991లో ఆయన రచించి, నటించిన  రుక్మిణీ కల్యాణం అనే పద్యనాటిక, అవధాన చక్రవర్తి, శతావధాన సార్వభౌమ డాక్టర్ శ్రీ మేడసాని మోహన్, శతాధిక  నాటక కర్త, నాటక నవరత్నం శ్రీ కొడాలి గోపాలరావు వంటి


 ప్రముఖుల మన్ననలను పొంది జనబాహుళ్యంలో మంచి ప్రాచుర్యం తెచ్చి పెట్టింది. సారా వ్యతిరేక ఉద్యమం ఉద్ధృతంగా ఉన్న రోజుల్లో సారాసుర సంహారం అనే గేయ నాటిక వ్రాసి అనేక ప్రాంతాల్లో విరివిగా ప్రదర్శనలు ఇచ్చి జిల్లా కలెక్టరు నుంచి ప్రత్యేక ప్రశంసలు పొందారు. ఎయిడ్స్ మహమ్మరి మీద వారు వ్రాసిన దర్పణం నాటిక 2002 లో చిత్తూరు జిల్లా నుంచి చాలా కాలం తర్వాత నంది నాటక పోటీలకు ఎంపికైన నాటకంగా సంచలనం సృష్టించింది.




 ఆయన ప్రజారోగ్యం, పర్యావరణం మీద కూడా ఎన్నో గేయాలు, పద్యాలు వ్రాశారు. వాటిని ప్రజలకు విరివిగా పంచి పెట్టి, ప్రదర్శనలిప్పించి చైతన్యం కలిగించే ప్రయత్నం చేశారు. ఆయన కృషిని గుర్తించిన కళాజగతి మాసపత్రిక వారు 2004లో కళాదిత్య బిరుదంతో సత్కరించారు. 2009లో అనంతపురం జిల్లా కలెక్టరు ఉత్తమసేవా ప్రశంసా పత్రం తో గౌరవించారు.



 రాష్ట్ర ప్రభుత్వం 2010లో ఉత్తమ శానిటరీ సూపర్వైసర్‌గా గ్రీన్ లీఫ్ అవార్డునిచ్చి సత్కరించింది. 2014లో మంగాపురం చంద్రమౌళి పూర్‌హోం సొసైటి పుష్యర ప్రతిభా పురస్కారంతో సన్మానించింది.



ఇటు సాహిత్యంలోనూ వారు కొత్తపుంతలు తొక్కారు. ప్రజారోగ్యం మీదున్న మమకారంతో, ప్రముఖ వైద్య నిపుణుల సూచనలతో, ఆరోగ్య ప్రాధాన్యాన్ని వివరిస్తూ 704 తేటగీతి పద్యాలతో  ఆరోగ్యగీత  అనే పుస్తకాన్ని వ్రాశారు. పాఠశాల విద్యార్థులకు పునశ్చరణ చేసుకోవటానికి వీలుగా ఉంటుందని దానినే 115 పద్యాలకు కుదించి ఆరోగ్య శతకం గా అందించారు. తెలుగులో ప్రజారోగ్యం మీద వచన రూపంలో ఎన్నో రచనలు వచ్చాయి గానీ ఇలా పద్యాల రూపంలో పుస్తకాలు, శతకాలు రావడం అదే ప్రథమం. ఈ విషయాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు గుర్తించి 2016లో ఆయనకు సర్టిఫికేట్ ప్రదానం చేశారు.




శ్రీ రత్నం వ్రాసిన ఈ ప్రేమను సమాధి చేద్దాం నాటకం ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటి కార్పొరేషన్ ద్వారా ఉత్తమ రచన పురస్కారం పొందింది. వారు వ్రాసిన మరో నాటకం  అన్నమాచార్య  2013లో జరిగిన గరుడ జాతీయ స్థాయి నాటకోత్సవాలలో ఉత్తమ
రచన పురస్కారం పొందింది. ఈ నాటకాన్ని అన్నమయ్య వంశీకుడైన శ్రీ తాళ్ళపాక హరినారాయణరావు గారిచే ఆవిష్కరింపజేయడం విశేషం. ఇటీవలే  తెనాలిలో జరిగిన 2017 నంది నాటకోత్సవాలలో తను వ్రాసిన దేవుడిచ్చిన వరం నాటకాన్ని పిల్లల చేత ప్రదర్శింపచేశారు. ఒక వైపు ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలను చేరదీసి అలుపెరుగని ఉత్సాహంతో తర్ఫీదునిచ్చి వాళ్ళ చేత అనేక ప్రదర్శనలిప్పించి ప్రోత్సాహకాలు ఇచ్చి కళానురక్తిని రగిలిస్తూ , మరోవైపు నాటక రచనా వ్యాసంగంలో తన కళాతృష్ణను చాటుకుంటూ నిరంతర విద్యార్థిలా ఆయన శ్రమిస్తూనే ఉన్నారు.

రచనలు

పద్యనాటకాలు: రుక్మిణీ కల్యాణం, అన్నమాచార్య, వ్యాధ బోధ (అముద్రితం )
పద్యకావ్యాలు: ఆరోగ్యగీత
శతకం: ఆరోగ్య శతకం
సాంఘిక గేయ నాటికలు: సారాసుర సంహారం, మశక మర్దనం
సాంఘిక నాటికలు: దర్పణం, జ్వాల, ఈ ప్రేమను సమాధి చేద్దాం, కంటివెలుగు, గ్రహదోషం, దేవుడిచ్చిన వరం
గేయ రచనలు: పరిశుభ్రత-పచ్చదనం, బ్రతుకు-బ్రతికించు, శుచి-శుభ్రత, ఆరోగ్యం-ఆహార్యం, పర్యావరణం, సమైక్యాంధ్ర 

  • షేర్ చెయ్యండి :  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg
కొత్తవి హోం

ప్రముఖ టపాలు

  • పరిచయం
    శ్రీ  బెల్లంకొండ రత్నం  గారు  చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన రచయిత, చిత్రకారుడు, రంగస్థల నటుడు.   వృత్తిరీత్యా శానిటరీ సుపర్వైసర్‌...
  • అయ్యో, బాబు !
    అ య్యో, బాబు ! అన్యాయానికి బలియైపోతివా? అక్రమ కేసుల్లోబడి యిరుక్కుపోయితివా ! నేరస్తులు గద్దెనెక్కి పరిపాలన సాగిస్తూ, నీతిపరుల బంధించి జైలుపా...
  • తిక్కన, తిరుపతి వేంకటకవుల ప్రఖ్యాత పద్యాలకు సవరణ
     జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్నట్లు ద్రౌపది ఆరవ భర్తగా కర్ణున్ని స్వీకరిస్తుందని శ్రీకృష్ణుడు ఏనాడూ అనలేదు.  శ్రీ మల్లాది చంద్రశేఖరశాస్త్రి గ...
  • ఆరోగ్యగీత
    ఆ రోగ్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి ? ఆరోగ్యంగా ఉండటమంటే రోగాలు రాకుండా ఉండటమేనా ? వ్యాధులు ఎలా సంక్రమిస్తాయి ? వాటి నివారణకు తీసుకోవల్సిన జ...
  • ప్రణయరాగం
    అ తడు:  ఏకాంత సమయము, ఇంకేల బిడియము ?              అందించు అందము,  అలరించు డెందము ఆమె:    కథలేవో అల్లకు, కౌగిళ్ళ చేరకు             నా బ...

భాండాగారం

  • ►  2025 (1)
    • ►  June (1)
  • ►  2023 (3)
    • ►  September (1)
    • ►  March (1)
    • ►  January (1)
  • ►  2022 (4)
    • ►  July (1)
    • ►  March (1)
    • ►  February (1)
    • ►  January (1)
  • ►  2021 (6)
    • ►  June (1)
    • ►  May (1)
    • ►  April (2)
    • ►  March (1)
    • ►  January (1)
  • ►  2020 (2)
    • ►  December (1)
    • ►  November (1)
  • ►  2019 (5)
    • ►  October (1)
    • ►  September (1)
    • ►  August (1)
    • ►  February (1)
    • ►  January (1)
  • ▼  2018 (21)
    • ▼  November (2)
      • కుందేట
      • విరహిణి
    • ►  October (1)
      • ఆశ
    • ►  September (1)
      • ఆరాధన
    • ►  August (1)
      • అన్నమాచార్య
    • ►  July (1)
      • నాట్యమయూరి -3
    • ►  June (2)
      • మేలుకొలుపు
      • ఛాయాచిత్రం -3 - శ్రీకృష్ణుడు
    • ►  May (3)
      • ప్రేమ
      • నాట్యమయూరి -2
      • నివేదన
    • ►  April (7)
      • హోదా గోదా !
      • ఛాయచిత్రం-2 - దుర్యోధనుడు
      • ఛాయచిత్రం-1 - తేజసింహుడు
      • రుక్మిణీ కల్యాణం
      • రాగం పలికింది
      • సరసిని
      • నాట్యమయూరి -1
    • ►  March (3)
      • ఆరోగ్య శతకం
      • ఆరోగ్యగీత
      • పరిచయం

పేజి వీక్షణలు

బ్లాగు సమూహాలు

మాలిక: Telugu Blogs
”శోధిని”
koodali.club

Copyright © బెల్లంకొండ రత్నం | Powered by Blogger
Design by Hardeep Asrani | Blogger Theme by NewBloggerThemes.com | Distributed By Gooyaabi Templates